ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. ధరల నియంత్రణపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరల నియంత్రణ.. పర్యవేక్షణపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. కెబినెట్ సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఉన్నారు. ధరల నియంత్రణపై కెబినెట్ సబ్ సిఫార్సులివ్వాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పౌరసరఫరాల శాఖ ఎక్స్ఆఫీషియో కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారని పేర్కోన్న ప్రభుత్వం…నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకస్మికంగా ఎందుకు పెరుగుతున్నాయన్న అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. నిత్యావసరాలు, కూరగాయలు ధరల తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యలపైనా సిఫార్సులు చేయాలని స్పష్టం చేసింది సర్కార్.
ఉత్పత్తి, సప్లై, డిమాండ్ , ధరలకు సంబంధించిన అంశాలు, పంటల తీరు, ఎగుమతులు, దిగుమతులపై కూడా అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. వినియోగదారులకు అందుబాటు ధరల్లో నిత్యావసరాలు, కూరగాయలు లభించేలా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచనలు చేసింది. ధరలు నియంత్రణలోకి తెచ్చేందుకు అవసరమైన యంత్రాంగం రూపకల్పనకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ అంశాలపై ఓ డేటా బేస్ ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.