తెలంగాణలోని పేద ప్రజలందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అక్టోబర్ 31న దీపావళి పర్వదిన కానుకగా ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి పండుగ రోజు అమవాస్య కావడంతో ఆ తరువాత 1 లేదా రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ గృహాలను నిర్మించనున్నట్టు తెలిపారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి బహు పేదలను పారదర్శకంగా ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అదేవిధంగా భూముల కేటాయింపు పై జరుగుతున్న ప్రచారం పై స్పందిస్తూ.. ఎవ్వరికీ ఏ రకమైన భూములు కేటాయించడం లేదని మంత్రి స్పష్టం చేశారు. సచివాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.