శనివారం రోజు అనకాపల్లి జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు. వెన్నెలపాలెంలో రహదారిపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారిగా మారాయని మండిపడ్డారు.
రహదారులు ఈ దుస్థితికి రావడానికి గత పాలకులే కారణమని, గత ముఖ్యమంత్రి రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రహదారులు అభివృద్ధికి చిహ్నం అన్నారు చంద్రబాబు. సంక్రాంతి లోపు రోడ్లపై ఉన్నటువంటి గుంతలన్నీ పూడ్చాలని అధికారులకు సూచించారు. గుంతలు లేని రోడ్లే తమ లక్ష్యమని అన్నారు చంద్రబాబు. రహదారులు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని చెప్పారు.
రహదారులు బాగుంటేనే వ్యాపారాలు కూడా జరుగుతాయన్నారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు వద్దని.. అభివృద్ధి రాజకీయాలు కావాలన్నారు. 2014 – 19లో రహదారులు ఎలా ఉండేవో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసామని అన్నారు. రాష్ట్రంలోని రహదారులపై గుంతలు లేకుండా చూసే బాధ్యత మాది.. రాష్ట్రంలో మళ్లీ భూతం రాకుండా చూసే బాధ్యత ప్రజలదని అన్నారు చంద్రబాబు.