ప్రస్తుత సమాజంలో “స్ట్రాంగ్ వుమన్” అని పిలవబడే మహిళలు తమలోని బాధలను, భావోద్వేగాలను బయటపెట్టడానికి ఇష్టపడరు. వారు తమ జీవితంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా, ఒంటరిగా ఎదుర్కొంటారు. కానీ ఎంత బలంగా ఉన్నప్పటికీ, వారిని కూడా ఒంటరితనం వెంటాడుతుంది. ఈ పరిస్థితి వెనుక ఉన్న కారణాలు, ఒక మహిళ తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్ల గురించి తెలుసుకుందాం.
ఎందుకీ ఒంటరితనం: ఒక మహిళ కుటుంబం, ఉద్యోగం, పిల్లలు ఇలా అనేక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఈ బాధ్యతలన్నీ ఒంటరిగా మోస్తున్నప్పుడు, తమ భావాలను పంచుకోవడానికి ఎవరికీ సమయం ఉండదని భావిస్తుంది. “స్ట్రాంగ్ వుమన్” అని పిలవబడేవారు ఎల్లప్పుడూ బలంగానే ఉండాలని సమాజం, కుటుంబం ఆశిస్తాయి. దీనివల్ల వారు తమ బలహీనతలను, భయాలను ఎవరికీ చూపించలేరు. చాలామంది మహిళలు తమ భావోద్వేగాలను అణిచివేసుకుంటారు. ఏడవడాన్ని, బాధపడడాన్ని బలహీనతగా భావిస్తారు. “బలవంతురాలికి ఎవరి సహాయం అవసరం లేదు” అని సమాజంలో ఒక అపోహ ఉంది. ఈ కారణంగా, సహాయం కావాలని అడగడానికి కూడా వెనుకాడతారు.

మహిళా తన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు: ఒక మహిళ జీవితంలో చాలా కష్టాలను, సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇవి ఆమెను మానసికంగా మరింత ఒంటరిగా చేస్తాయి. జీవితంలో కొన్నిసార్లు తప్పటడుగులు వేయడం సహజం. కానీ, ఒక మహిళ చేసిన తప్పును సమాజం సులభంగా మర్చిపోదు. దీనివల్ల ఆమె మరింత ఒంటరితనానికి గురవుతుంది. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఈ ప్రక్రియలో ఆమె అలసిపోతుంది, అయినప్పటికీ ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ ఉండకపోవచ్చు. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడం ఒక సవాలు. ఈ క్రమంలో ఆమె అనేక ఒత్తిడులను ఎదుర్కొంటుంది.
ఒక మహిళ బలంగా ఉండడం అంటే ఆమెకు ఒంటరితనం ఉండదని అర్థం కాదు. వారు తమ భావాలను పంచుకోవడానికి, సహాయం కోరడానికి భయపడకూడదు. తమలోని బలహీనతలను అంగీకరించడం కూడా ఒక బలం అని అర్థం చేసుకోవాలి.