మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇకమీదట అవుటర్ రింగ్ రోడ్డులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు రాచకొండ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధ్యయనం చేసిన రాచకొండ పోలీసులు.. ఓఆర్ఆర్ పై జరుగుతున్న ప్రమాదాలలో నిర్లక్ష్యపు డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లే పలు ప్రమాదాలకు కారణంగా నిర్ధారించుకున్నారు. దీంతో ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరలో ఓఆర్ఆర్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు.
ఇప్పటికే ఆక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీం లను ఏర్పాటు చేశారు. పోలీసులు, అధికారులు రోడ్లమీద ఉంటేనే ట్రాఫిక్ నియంత్రణలో ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించినట్లు కమిషనర్ సుధీర్ బాబు తాజాగా వెల్లడించారు. ఇదే కాకుండా ప్రజలతో ట్రాఫిక్ పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనేది తెలుసుకునేందుకు 100 బాడీ వార్న్ కెమెరాలను కొనుగోలు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.