రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర, ఐటి, పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటి ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి పర్యటించి,పలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేయవద్దని,మన దేశంలోనే సరిపడ పత్తి నిల్వలు ఉన్నాయని శ్రీధర్ బాబు అన్నారు. సన్న రకం ధాన్యం క్రింద ఏ రకం ధాన్యాన్ని పరిగణిస్తున్నామనే అంశంపై రైతులకు స్పష్టంగా తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే దొడ్డు రకం, సన్న రకం తేడాను స్పష్టంగా తెలియజేసేలా కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలు, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలో ఉన్న మిల్లుల నుంచి బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తామని అండర్ టేకింగ్ ఆఫిడవిట్ తీసుకొని ధాన్యం కేటాయింపులు చేయాలని తెలిపారు. రైస్ మిల్లుర్లు తాలు పేరుతో రైతులకు కోతలు పెట్టవద్దని పేర్కొన్నారు. సన్న రకం దాన్యంపై ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ అర్హులైన ప్రతి రైతుకు అందాలని అన్నారు. జిల్లా సరిహద్దులో పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం మన జిల్లాకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.