తెలంగాణలో మరోసారి గంజాయి కలకలం రేపింది. ఇప్పటికే నగరంలో గంజాయి సరఫరా పెద్ద ఎత్తున జరుగుతుండగా.. నేటితరం యువత గంజాయి మత్తులో చిత్తవుతున్నారు. నగరంలో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు ఇటీవల పట్టుబడిన విషయం తెలిసిందే. దీనికి తోడు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో గంజాయి సరఫరా జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా కాలేజీ యువతే వీటిని సరఫరా చేస్తూ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఈ క్రమంలోనే వరంగల్లో గంజాయి కలకలం రేపింది. వరంగల్ జిల్లాలోని శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60) సులభంగా డబ్బు సంపాదించడం కోసం తన ఇంటి మేడపై గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పల్లెబోయిన కుమార్ రైల్వే స్టేషన్లో గంజాయితో సంచరిస్తుండగా పక్కా సమాచారంతో యాంటీ డ్రగ్స్ టీం తనిఖీలు చేసి పట్టుకున్నారు. అనంతరం అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. మేడ మీద పెంచుతున్న గంజాయి మొక్కలని స్వాధీనం చేసుకున్నారు.