తెలంగాణలో కులగణన సర్వే ప్రస్తుతం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఏరియాల్లోని ఇళ్లకు వెళ్లి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ వారు పనిచేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నా.. కొందరు విద్యార్థులు, ప్రైవేట్ వ్యక్తులు సైతం ఈ సర్వేలో పాల్గొంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే సర్వే కోసం ఓ స్టూడెంట్ రాగా.. ప్రైవేట్ వ్యక్తులు ఎలా సర్వేచేస్తారంటూ ఓ ఇంటి యజమాని ప్రశ్నించారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యోగులే ఈ సర్వే చేస్తున్నారని ప్రభుత్వం చెబుతుంటే ప్రైవేట్ వ్యక్తులను సర్వేకు పంపి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు అడగడం ఏంటని నిలదీస్తున్నారు. కులగణన చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వ్యక్తిగత వివరాలు సేకరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.