గత ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని.. ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో విమర్శించారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంపదను పెంచకుండా విపరీతంగా అప్పులు చేశారని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులను పెండింగ్ లో పెట్టడంతో అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిగా పక్కన పెట్టారు. పోలవరం పనులు నిలిపి వేసి డయాఫ్రం వాల్ డ్యామేజీకి జగన్ కారణమయ్యారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పు దారి పట్టిందని తెలిపారు. ఇప్పుడు కూడా అంకెల గారడీ చేసి ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్ లో పెట్టారు. పిల్లలకు ఇచ్చే చిక్కీల బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టారు. ఫీజు రీయంబర్స్ చేయకపోవడంతో కళాశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదన్నారు. మేము వచ్చాక సర్టిఫికెట్లను ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.