రాబోయే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో అర్హులైన నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్, చిత్తూరులో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతోంది. ఈ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండటంతో ఈ నేపథ్యంలో నవంబర్ 20వ తేదీ వరకు పొడగించారు. ఈ శిక్షణకు టీటీసీ, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే అర్హులు అని దరఖాస్తుదారులు జిల్లా బీసీ వెల్పేర్ ఆఫీసర్ ఓ ప్రకటనలో తెలిపారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలని.. శిక్షణలో సీట్ల కేటాయింపు బీసీలకు 66 శాతం ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం ఉండగా.. అదనంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. రెండు నెలల శిక్షణ కాలంలో 75 శాతం హాజరు ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టైపండ్, మెటీరియల్ కోసం రూ.1000 అందజేయనున్నట్టు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు బయోడేటాతో పాటు సంబంధించిన పత్రాలు అన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయంలో సమర్పించాలని అధికారి రబ్బానీ భాష సూచించారు.