బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీని దక్కించుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సూచనతోనే మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? కలెక్టర్‌ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కలెక్టర్‌పై దాడి ఘటనను సమర్థించడమేమిటని ప్రశ్నించారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మూసీ పరీ వాహక ప్రాంతంలో ఈరోజు బీజేపీ చేస్తున్న ‘మూసీ నిద్ర’పైనా పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ నేతలు మూసీ వద్ద రేపు నిద్రలేచిన తర్వాత అక్కడి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు మొద్దు నిద్ర నుంచి లేవాలన్నారు.