తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009 నవంబర్ 29కు ప్రత్యేక గుర్తింపు ఉందని..తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ జైత్రయాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర.. తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో అనే సంకల్పంతో దీక్ష ప్రారంభించిన రోజని కవిత గుర్తు చేసుకున్నారు.
ప్రత్యేక తెలంగాణ పోరాటంలో చారిత్రాత్మక రోజైన నవంబర్ 29న తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత కేసీఆర్ పోరాట స్పూర్తిని స్మరించుకుంటూ యావత్ ప్రజానీకాన్ని జాగృతం చేస్తూ..నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ‘దీక్షా దివస్’లో పెద్ద ఎత్తున పాల్గొందామని కవిత పిలుపు నిచ్చారు. ఇదిలాఉండగా, నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దీక్షా దివస్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.