రైతు బంధును మాజీ సీఎం కేసీఆర్ ఆపలేదని.. సీఎం రేవంత్ రెడ్డే ఆపారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. గతంలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్..అధికారంలోకి వచ్చాక ఉన్న రైతుబంధు కూడా ఇవ్వట్లేదని ఫైర్ అయ్యారు.
రైతుబంధు, రైతు భీమా కింద కేసీఆర్..అన్నదాతలకు రూ.82వేల కోట్లు జమ చేశారని గుర్తుచేశారు. కౌలు రైతుల సమస్యలపై రైతు, కౌలు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలని సీఎం,మంత్రి అనడం ఏంటని విమర్శించారు. ఇక రేవంత్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను సైతం ఎగ్గొట్టిందని, పండుగ పూట మహిళలను మోసం చేసిందన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని.. ఇప్పుడు రూ.15వేల కోట్లు కట్టించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని, పేదలపై ఈ ప్రభుత్వానికి నిజమైన ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్‌ను ఉచితం చేయాలన్నారు.