తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణీ పోర్టల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను గుర్తించి.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని సవరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగా ధరణీ పోర్టల్ ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధరణిలో కొన్ని మార్పులను తీసుకొచ్చామని తెలిపారు.
పోర్టల్ నిర్వహణను ఈనెల 01వ తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్ఐసీకి మార్చామని తెలిపారు. 2020 ఆర్వోఆర్ చట్టంలో లోపాలు సరి చేసి 2024 ఆర్వోఆర్ చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని తెలిపారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్య ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందని.. కానీ రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నట్టు చెప్పారు మంత్రి పొంగులేటి.