రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నందున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.అయితే, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యేల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన కామెంట్స్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ ఆ ఆరోపణలను ఖండించారు.
స్పీకర్ సభలో సభ్యులందరికీ చెందిన వాడని, ప్రతిపక్షాలు కూడా నేను స్పీకర్‌గా ఎన్నికవ్వడానికి సహకరించారని గుర్తుచేశారు.నేను ఏక పక్షంగా వ్యవహరిస్తున్నానంటూ కేటీఆర్ మాట్లాడటం సీనియర్ శాసన సభ్యుడిగా ఆయన విజ్ఞతకు,వ్యక్తిత్వానికి తగదన్నారు.బీఆర్ఎస్ వాళ్లు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న నైరాశ్యంలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో వ్యవహరిస్తున్నారని చురకలంటించారు. సభలో అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శించారు.