రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రముఖ సినీ గేయ రచయిత సాహితీవేత్త సుద్దాల ఆశోక్ తేజ స్పందిస్తూ.. సచివాలయంలో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంలో నాకు ముగ్గురమ్మల మూలపూటమ్మనో.. పెద్దమ్మనో.. దేవతనో కనిపించలేదని..నన్ను కన్న నా తల్లి జానకమ్మ కనిపించిందని పేర్కొన్నారు.
మా అమ్మనే కాదు..నా తోబుట్టువులు కనిపించారని, సాధారణ మధ్యతరగతి దిగువ కుటుంబాల ఒక రైతు వనిత కనిపించిందని..తెలంగాణ నేలమ్మ కనిపించిందని కితాబిచ్చారు.అలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి శిరసా ప్రమాణాలని తెలిపారు.తెలంగాణ తల్లి విగ్రహం ఫోటోను పాఠ్య పుస్తకాల్లోనూ ప్రదర్శించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని సమాచారం. ఇప్పటికే జయజయహే తెలంగాణ అధికారిక గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తుండగా, వందేమాతరం, జనగణమన సరసన రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ముద్రిస్తున్నట్లు తెలిసింది.