స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారు అని ఏపీ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సినిమాలు చూసి యువత చెడు దారి పడుతోందని హోంమంత్రి పేర్కొన్నారు. సినిమాల్లోని మంచిని వదిలేసి, చెడునే ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ , గంజాయి, స్మగ్లింగ్ చేసే వారినే హీరోలుగా చూస్తున్నారు. కానీ ఇలాంటి సంస్కృతి పోవాలి. ఆడబిడ్డలను రక్షించేవారినే హీరోలుగా చూడాలి. మగ పిల్లలను సరిగ్గా పెంచితే ఈ సమస్యలు ఉండవని తెలిపారు హోంమంత్రి అనిత.
ఆడపిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో సేవ్ ది గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు చేపడుతున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు తరువాత అంతే కార్యదక్షతో పని చేసే వ్యక్తి నిమ్మల రామానాయుడు అని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆడబిడ్డలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.