హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద పలువురు ఓయూ స్టూడెంట్స్ నిరసనకి దిగారు. అనంతరం వారంతా ఒక్కసారిగా బన్నీ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్న కుండీలను పగలగొట్టారు. అలాగే బలవంతంగా ఇంట్లోకి చొరబడే ప్రయత్నాలు కూడా చేశారు.
రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరాహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపించారు. అల్లు అర్జున్ ఇంటి పైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను అరెస్టు చేశారు. దాడి సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని అల్లు అర్జున్ పిల్లలని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. మా ఇంటి ముందు జరిగిన ఘటన అందరూ చూశారని.. ఇలాంటి ఘటన ఎవరికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలని సూచించారు అరవింద్. అదే అందరికీ మంచిదన్నారు. ఎవరూ తొందరపడి ఎటువంటి చర్యలకు దిగవద్దని కోరారు అరవింద్.