మహారాష్ట్రలో ఇటీవల హింసకాండ చెలరేగిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని ఫర్బానిలో చెలరేగిన ఈ హింసకాండలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను సోమవారం సాయంత్రం కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఫర్బాని రైల్వే స్టేషన్ బయట ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతిరూపాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
దీంతో డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం భారీ నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో రెచ్చిపోయిన ఆందోళనకారులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అయితే ఆందోళనకు దిగిన వారిలో దాదాపు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో న్యాయ విద్య చదువుతున్న సోమనాథ్ సూర్య వంశీ కూడా ఉన్నారు. కస్టడీలో ఉన్న సూర్య వంశీకి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం సూర్య వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫర్బానిలో చెలరేగిన అల్లర్లలో అరెస్ట్ అయిన వ్యక్తి మరణించడానికి పోలీసులే కారణమని ఆరోపించారు రాహుల్ గాంధీ.
సూర్య వంశీ ఒక దళితుడని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న ఆ వ్యక్తిని హత్య చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. మృతుడి వీడియోలు, ఫోటోలు చూస్తే ఇది 100% కస్టోడియల్ డెత్ అని అనిపిస్తుందని ఆరోపించారు. అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.