కలెక్టర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు ప్రధాన పధకాలను ఈనెల 26 వతేదీ నుండి అమలుచేయాలని నిర్ణయించాం. భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ, రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలన్న భావనతో విస్తృతంగా చర్చించిన మీదటే, ఈ పధకాలను అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే, ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసాం. ఈ పధకాల అమలులో ఇందిరమ్మ కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలి. లబ్ధిదారుల ఎంపికను, ప్రతీ ఉమ్మడి జిల్లాలో ఇంచార్జి మంత్రులు ఇందిరమ్మ కమిటీలతో చర్చించిన మీదటే చేపట్టాలి.
ప్రస్తుతం నిర్ణయించే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ప్రతీ గ్రామంలో ఫ్లెక్సీల ద్వారా ప్రకటించాలి. ఇప్పటికే, రాష్ట్రంలో 22000 కోట్ల రైతు రుణ మాఫీలను చేసాం. ఈ వివరాలను కూడా ప్రతీ గ్రామంలో ప్రకటించాలి. ఈ నాలుగు పధకాలను సంబంధించి సవివరమైన మార్గ దర్శకులతో ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్దిదారులను ఎంపిక చేయాలి. ఈ పథకాలపై జిల్లాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి అని భట్టి విక్రమార్క సూచించారు.