యాదాద్రి-భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి చేసిన నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో గొడవలు జరిగే అవకాశం ఉందని భావించి ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను పలువురిని హౌస్ అరెస్ట్ చేసింది. తాజాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యంగా ఆందోళనలకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా.. ఘట్కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మాజీమంత్రికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తాను పార్టీ కార్యాలయానికి పరిశీలనకు మాత్రమే వెళుతున్నానని, ఆందోళన చేసేందుకు కాదని పోలీసులకు జగదీష్ రెడ్డి తెలిపారు. దీనికి పోలీసులు మీరు వెళ్లడం పట్ల ఎటువంటి సమస్య లేదని, మీ వెంట జనం రావడంతో కొత్త సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. దయచేసి తమకు సహకరించాలని చెప్పి.. జగదీశ్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.