సంక్రాంతి పండుగ రోజున మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో కేరళలోని శబరిమలకు తరలివచ్చారు. పొన్నంబలమేడు పై ఇప్పటికే వేలాది మంది దర్శనం కోసం వేచి ఉన్నారు. గంటల తరబడి మకర జ్యోతి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. చుట్టు పక్కల అడవుల్లో కూడా భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడారు. ప్రస్తుతం ఆ ప్రాంతాలు అన్నీ స్వామియే శరణం అయ్యప్ప అంటూ నినాదాలతో మారుమ్రోగుతోంది.
ఆలయం చుట్టూ ఉన్న 18 పవిత్ర కొండలపై భక్తులు తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. లక్షలాది మంది భక్తులు పొన్నంబలమేడులో మకర జ్యోతిని చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీపారాధన కోసం నాలుగు రోజుల క్రితమే కొండపైకి భక్తులు చేరుకున్నారు. ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులు అంతా కొండను వదలడం లేదు. ఇప్పటికే కొండపైకి మంగళవారం 1.5లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం 64,194 మంది భక్తులు కొండపైకి వెళ్లినట్టు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేలాదిగా పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.