సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరంలో గాలిపటాలను యువత, పెద్దలు, పిల్లలు అంతా సంబరంగా ఎగరేస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.అయితే, గాలిపటాలు ఎగరేసే సమయంలో ఉపయోగించే చైనా మాంజా అటు పక్షులు, ఇటు మనుషుల ప్రాణాలకు ప్రమాదకారిగా మారింది.
‘చైనీస్ మాంజా’ వాడొద్దని నగర పోలీసులు, సోషల్ యాక్టివిస్టులు కొందరు చెబుతున్నా విక్రయదారులు దానిని అమ్మడం మానడం లేదు. ప్రమాదకరమని తెలిసినా గుట్టుగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం నారాయణగూడ పీఎస్ పరిధిలో లంగర్‌హౌస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శివరాజ్‌కు చైనా మాంజా తగిలి తీవ్రగాయమైంది. నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ రోడ్డు మీదుగా ఇంటికి వెళ్తున్న క్రమంలోనే చైనీస్ మాంజా అతని మెడకు తగిలి కోసుకుపోయింది. తీవ్రరక్తస్రావం కావడంతో బాధితుడికి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.