ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో భవనాల డిజైన్లపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నెల 31న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ కొత్త బిల్డింగులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త భవనాల డిజైన్ల ఖరారుపై మంత్రి అధికారులతో చర్చించారు.
ఈ నెల 25న జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్లలో పలు మార్పులు సూచించారు. దీంతో
ముఖ్యమంత్రి సూచనల ఆధారంగా అధికారులు డిజైన్లలో మార్పులు చేశారు. ఈ మార్పులు చేసిన
డిజైన్లను మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అధికారులు ప్రజెంటేషన్ పై
మంత్రి పలు సలహాలు ఇచ్చారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందేళ్ల చరిత్ర
కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం స్థల
కేటాయింపు కూడా చేసింది. గోషామహాల్ లో ని పోలీస్ స్టేడియంలో ఉస్మానియా కొత్త భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు.