వసంత పంచమి రోజున సరస్వతి దేవిని అందరూ పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘ మాసంలో శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం సరస్వతి దేవి వసంత పంచమి రోజున జన్మించింది అని నమ్ముతారు. ఈ పండుగ అనేది ముఖ్యంగా పిల్లలకు ఎంతో పవిత్రమైన రోజు అనే చెప్పవచ్చు. పైగా ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం వలన ఎంతో మంచి జరుగుతుందని మరియు వారి ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని భావిస్తారు. వసంత పంచమి రోజు సరస్వతి దేవిని పూజించడం వలన పిల్లలలో ఏకాగ్రత పెరిగి ప్రయోజకులు అవుతారని నమ్ముతారు.
అయితే ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం నాడు వచ్చింది. అయితే పంచమి తిధి ఉదయం 9:14 కు ప్రారంభమై మరుసటి రోజు 6:52 నిమిషాల వరకు ఉంది. పంచాంగం ప్రకారం ఉదయం తిధిని పరిగణించడం వలన ఈ సంవత్సరం వసంత పంచమిని ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకుంటారు. అయితే దీనికి సంబంధించి అనుకూలమైన సమయాన్ని 7:09 గంటల నుండి మధ్యాహ్నం 12:35 గంటల వరకు అని పండితులు చెబుతున్నారు.
వసంత పంచమి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తల స్నానం చేసి సరస్వతి దేవికి ఎంతో ఇష్టమైన పసుపు లేక తెలుపు రంగులో ఉండే బట్టలను ధరించాలి. పూజ స్థలాన్ని శుభ్రపరిచి సరస్వతి దేవి ఫోటోకు లేదా విగ్రహానికి ధూపం, దీపం, అక్షింతలు, పువ్వులు, చందనం వంటివి సమర్పించాలి. పూజలో భాగంగా సరస్వతీ వందనం మరియు సరస్వతి మంత్రాలను పఠించాలి. నైవేద్యంలో భాగంగా పసుపు రంగులో ఉండే మిఠాయిలను పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుంది. కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా అందరూ అమ్మవారిని పూజించవచ్చు. పెళ్లయిన వారు అమ్మవారిని పూజించడం వలన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది.