కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. ఆడపిల్లలు, యువత, మహిళలు, రైతులు తో పాటుగా వృద్ధులకు కూడా కొన్ని రకాల పథకాలను తీసుకురావడం జరిగింది. వీటిలో భాగంగా సీనియర్ సిటిజెన్లకు కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభ్యుదయ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉండే వృద్ధులకు ఆహారం, ఆరోగ్యం వంటి మొదలైన సేవలను ఈ పథకం ద్వారా అందిస్తున్నారు.
అర్హత వివరాలు:
భారతదేశానికి చెందిన 60 ఏళ్ల వృద్ధులు ఈ పథకానికి అర్హులు. అంతేకాక సీనియర్ సిటిజెన్లతో పాటుగా నిరుపేద వృద్ధులు, పిల్లలు లేని నిరుపేద వృద్ధులు అర్హులు. అటల్ వయో అభ్యుదయ యోజనకు దరఖాస్తు కోసం మీ ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం మరియు ఆరోగ్య సమాచారానికి సంబంధించిన పత్రాలను అధికారిక ఆన్లైన్ పోర్టల్ లో అందజేయాలి.
పథకం ద్వారా పొందే ప్రయోజనాలు:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న సీనియర్ సిటిజెన్లకు నెలవారీ పెన్షన్ ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ఆదాయం పొందని వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా ఈ పథకం ద్వారా ఆరోగ్య బీమా ను కూడా పొందవచ్చు. సీనియర్ సిటిజెన్లకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు మరియు వైద్యులు ఖర్చులను కూడా తగ్గించడానికి ఈ పథకం సహాయం చేస్తుంది.
ఆరోగ్య బీమా తో పాటుగా జీవిత బీమాను కూడా ఈ పథకం అందిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత నామినీను కూడా ఎంపిక చేసుకోవచ్చు. దీంతో కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక సహాయం లభిస్తుంది.
అటల్ వయో అభ్యుదయ యోజన పథకంలో భాగంగా ఎన్నో రకాల ఉప పథకాలు ఉన్నాయి. కనుక తగిన పథకాన్ని ఎంపిక చేసుకుని ఈ ప్రయోజనాలను పొందండి.