మాఘమాసం.. సూర్య ఆరాధనకు విశిష్టమైన నెలగా భావిస్తారు. ఈ సమయంలో ప్రముఖ సూర్య ఆలయాలని దర్శిస్తే మంచదని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆయా సూర్యదేవాలయాల సందర్శన వల్ల మంచి ఫలితాలు వుంటాయని పండితులు పేర్కొంటున్నారు. రథసప్తమి ఫిబ్రవరి 1న ఉన్న నేపథ్యంలో పవిత్రమైన సూర్యదేవాలయం గురించి తెలుసుకుంటే పాపహరణ, రోగహరణ కలుగుతాయి. ఆ విశేషాలు….
ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. వైదిక కాలంలో, పురాతన కాలంలో సూర్యారాధనకే అధిక ప్రాధాన్యత ఉండేది. మరీ ముఖ్యంగా సౌరాష్ట్రంలో అంటే నేటి గుజరాత్ ప్రాంతంలో సూర్యారాధన ఎక్కువగా చేసేవారు. అయితే కాలం గడిచేకొద్దీ సూర్యునికి ప్రత్యేకించిన దేవాలయాల సంఖ్య తగ్గిపోయింది.
ఇక తెలుగు ప్రజలకి సైతం అంతగా తెలియని పురాతన సూర్య ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. కాకినాడకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అనే గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం చెంతనే తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని ఓ నమ్మకం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గొల్లల మామిడాడలో అంతే చరిత్ర కలిగిన ఆలయాలకీ కొదవ లేదు. 160 అడుగుల ఎత్తు గోపురం కలిగిన రామాలయం, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయం వాటిలో ప్రముఖమైనవి. ఊరిలోకి అడుగుపెడుతూనే అనేక గోపురాలు దర్శనమిస్తుంటాయి. అందుకే ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుచుకుంటారు.
గొల్లల మామిడాడలోని సూర్యనారాయణస్వామి దేవాలయం ఈనాటిది కాదు. ఎప్పుడో 1902లో కొవ్వూరి బసివిరెడ్డి అనే జమీందారు భక్తిశ్రద్ధలతో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నిరాటంకంగా ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆదివారం వేళ్లలో ఈ ఆలయంలో జరిగే విశేష పూజలను చూసి తీరాల్సిందే. ఇక రథసప్తమి వంటి పర్వదినాలలో అయితే స్వామివారికి జరిగే కళ్యాణంలో పాలుపంచుకునేందుకు వేలాది భక్తులు వస్తుంటారు.
గొల్లల మామిడాడలో సూర్య భగవానునికి ఆలయం ఉండటమే ఓ విశేషం అయితే, ఈ స్వామి ఉష, ఛాయ అనే దేవేరులతో కలిసి సతీసమేతంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత.
కేశవ