సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. అలాగే.. ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్స్ తో పాటు.. బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని జాన్ వెస్లీ లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ను సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నారు. నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.
ల్యాబ్ పరికరాలు, హాస్టల్స్, మెస్, స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు. వందేండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి న్యాక్ నేషనల్ అస్సెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుర్తింపులో వెనుకబడి ఉందని జాన్ వెస్లీ లేఖలో తెలిపారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి.. విశ్వవిద్యాలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొన్నారు. వీటిని పరిరక్షించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.