శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ పనులు జరుగుతున్న వేళ ఘోర ప్రమాదం సంభవించింది.టన్నెల్ 14వ కి.మీ మైలురాయి వద్ద సుమారు 3 కి.మీ మేర పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. మరికొందరు కార్మికులు టెన్నెల్లోనే చిక్కుకున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఘటనా స్థలికి చేరుకుని ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి సేకరించారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు.
మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ..ప్రమాదం సరిగ్గా ఉదయం 8.30 ప్రాంతంలో జరిగిందని పేర్కొన్నారు. ఆ టైంలో టన్నెల్లో సుమారు 50 మందికిపైగా కార్మికులు ఉన్నారని చెప్పారు. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టన్నెల్ నుంచి ముగ్గురు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామన్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాసేపట్లో ఘటనా స్థలికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్నారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు.