ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యులకు సీట్లను కేటాయించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సూచనల మేరకు సీట్ల కేటాయింపు జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించారు. సీట్ విషయంలో ఏదైనా సందేహాలుంటే సిబ్బంది సహకారం తీసుకోవచ్చని ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు. ట్రెజరీ బెంచ్ గా ముందు వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులకు సీట్లను కేటాయించారు. అనంతరం చీఫ్ విప్, విప్ లకు సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం, వైసీపీ శాసన సభా పక్షనేత వైఎస్ జగన్ కు ప్రతిపక్ష బెంచిలో ముందు వరుస సీట్ కేటాయించారు. సీఎం చంద్రబాబుకు బ్లాక్ 1లోని సీట్ 1 ను కేటాయించగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు బ్లాక్ 2లో 39వ సీట్ ను నిర్ణయించారు. వైస్ జగన్ కి బ్లాక్ 11లోని 202 కేటాయించారు. అంటే స్పీకర్ కు ఎడమచేతి వైపు ఎదురుగా జగన్ సీట్ ఉండనుంది. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు గతంలో కూర్చున్న స్థానంలో జగన్ కు సీట్ కేటాయించారు.