పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే చేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శాసనమండలి సమావేశంలో సమాధానం ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరినప్పుడు మంత్రి పై విధంగా స్పందించారు. 2019 ఫిబ్రవరి 18న 55 వేల కోట్లకు టెక్నికల్ అడ్వెజరీ కమిటీలో చంద్రబాబు ద్వారానే పోలవరం వ్యయం ఆమోదించారు.
2014 – 19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ -1, ఫేజ్- 2 అని గాని, 41.15 మీటర్లు. 4.7 మీటర్లు లేవన్నారు. అలాంటిదేమైనా ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ఎత్తుకు సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 లు తెచ్చింది కూడా 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వమేనని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. 2020లో జగన్ పోలవరం కుడికాలువ నీటి సామర్థ్యాన్ని 17,560 నుండి 11650కు, ఎడమ కాలువ నీటి సామర్థ్యాన్ని 17,500 నుండి 8122 క్యూసెక్కులకు తగ్గించి ఉత్తరాంధ్ర రాయలసీమకు జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. నోరు ఉంది కదా అని, ఏది పడితే అది మాట్లాడటం, అవినీతి పత్రిక ఉంది కదా అని అబద్ధపు రాతలు రాయడం, ఎంత మాత్రం మంచిది కాదన్నారు.