విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా వేదికగా అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం.. విద్యార్థులకు శాపంగా మారుతోందని తెలిపారు. ఇదే విషయమై డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, స్కాలర్ షిప్స్ బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క సమాధానం చెప్పారని గుర్తుకు చేశారు.
ఈ మాట చెప్పి మూడు నెలలు పూర్తి కావస్తోందని, ఇప్పటి వరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించిన దాఖలు లేవన్నారు. రేవంత్ సర్కారుకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస, పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడం పై లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన విదేశీ విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు