ఎస్సీ వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉన్నదని ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో కాంగ్రెస్, బీజేపీ లు చట్టసవరణ చేయలేదని గుర్తుచేశారు. తాము గతంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశామని అన్నారు. అప్పట్లోనే పార్లమెంట్ దీనిని ఆమోదించి ఉంటే.. ఇప్పటికే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కేవని చెప్పుకొచ్చారు. ఇకపై నిర్వహించే ప్రతీ ఉద్యోగ నియామక ప్రక్రియలో వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.
అంతకుముందు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో ఈ సమస్యకు పరిష్కారం చూపటం చాలా సంతోషాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ
వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాం.. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ను ఏమాత్రం మార్చకుండా ఆమోదించామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.