ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర షురూ అయింది. తాజాగా 47 మార్కెట్ కమిటీలకు సంబంధించి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం శుక్రవారం రోజున ఛైర్మన్లను ప్రకటించింది. 47 మార్కెట్ కమిటీలకు గానూ.. సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు వెల్లడించింది.
తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో 37 తెలుగుదేశం, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతేడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకంగా 60 వేలకు పైగా దరఖాస్తులు రాగా.. తొలి జాబితాలో 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందికి అవకాశం కల్పించింది రాష్ట్ర సర్కార్. రెండో జాబితాలో మొత్తం 59 మందికి అవకాశం కల్పించింది.