ఈ ఎన్నికలు తమ పాలనకు కేవలం స్పీడ్‌బ్రేకర్ లాంటివేనని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని జలవిహార్ లో ఆయుష్ వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మట్లాడుతూ… రాష్ట్రంలో మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పడుతుందనే విషయం అన్ని వర్గాల ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం వైద్య, విద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఆయుష్, అల్లోపతి వైద్యులకు మధ్య ప్రభుత్వం వారధిగా వ్యవహరిస్తోందని చెప్పారు. గతంలో జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ఐసీయూ వంటి సౌకర్యాలు లేవు.. ఇప్పుడు ఆ లోపాలను సవరించడంతోపాటు రక్తనిధి కేంద్రాలను, రక్తశుద్ధి కేంద్రాలనూ ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ,ఎంపీ వినోద్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి పాల్గొన్నారు. భవిష్యత్లో మరిన్ని పథకాలను ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలిపారు.