వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు త్వరత్వరగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అనుకున్నది చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ఇక ఇటీవలే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పలు పథకాలను ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రజాసేవ నిమిత్తం మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు, అర్జీదారుల కొరకు ప్రతీ బుధవారం సెక్రటేరియేట్లో వారంతా హాజరు కావాలని జగన్ ఆదేశించారు. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ప్రతి మంగళవారం, బుధవారం విధిగా సచివాలయానికి రావాలని సీఎం ఆదేశించిన సంగతి విదితమే. అయితే దూరభారం, సంక్షేమ పథకాల దృష్ట్యా మంత్రులకు వెసులుబాటు కల్పిస్తూ వారంలో ఒక్క రోజు ఉంటే సరిపోతుందని తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. కాబట్టి ఇకనుంచీ మంత్రులు కూడా ప్రజాసేవలోనే ఉండనున్నారు.