బంగాల్లో రాష్ట్రపతి పాలన వస్తుందని.. వచ్చే ఏడాది రాష్ట్రపతి పాలనలోనే ఎన్నికలు జరుగుతాయని బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతకు విఘాతం కలుగుతోందని.. చాలా ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగి హింస నెలకొందని ఆరోపించారు. ముర్షిరాబాద్, సుతి, ధులియన్, జాంగిపుర్, శంషెర్గంజ్ జిల్లాల్లో అల్లరి మూకలు విధ్వంసం సృష్టిస్తుంటే అధికార పక్షం మౌనం వహిస్తోందని మండిపడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావాల్సిందేనని సువేందు తెలిపారు. ఎక్కడైతే హిందువులు మైనార్టీలుగా ఉన్నారో.. అక్కడ వారిని ఓటు వేయనివ్వడం లేదని, అధికార పార్టీ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల బంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక జిహాదిస్టులు ఉన్నారని సువేందు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని.. అందుకే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను సిఫారసు చేయడం గురించి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలని సువేందు అధికారి అన్నారు.