బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. సుబేదారి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా స్టే విధించింది. అయితే, దర్యాప్తు కొనసాగించవచ్చని, పోలీసులకు సహకరించాలని కౌశిక్ రెడ్డికి న్యాయస్థానం స్పష్టం చేసింది. క్వారీ యజమాని మనోజ్ నుండి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు నమోదైంది. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష్యల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని, ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఉన్నాయని తెలిపారు. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్, 2023 అక్టోబర్ 25న కౌశిక్ రెడ్డికి 25 లక్షల రూపాయలు చెల్లించినట్లు వాంగ్మూలం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ)ని హైకోర్టు ప్రశ్నించింది. బెదిరించడం వల్లే మనోజ్ 25 లక్షలు చెల్లించాడని, ఇప్పుడు మరో 50 లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో ఫిర్యాదు చేశారని పీపీ కోర్టుకు తెలిపారు. అయితే, 2023లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని హైకోర్టు పీపీని ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.