రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభనగర్ వద్ద జాతీయ రహదారిపై రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టాయి.
హైదరాబాద్ వెళ్తున్న కుటుంబం, భద్రాచలం దర్శనానికి వెళ్తున్న సౌత్ కొరియా టూరిస్టుల కార్లు ఉదయం ఢీకొన్నట్లు సమాచారం.ఈ ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నట్లు తెలిసింది.