భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశాలలో దేశ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలనే సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా మినహా ఇతర కులాలను కూడా పరిగణలోకి తీసుకునేవారు కాదని.. ఈ విషయం పై రాహుల్ గాంధీ ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ విజన్ నెరవేరబోతోందని.. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన చేశామని, ఇది స్వతంత్ర దేశంలోనే మొదటిది అని.. తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికి ఆదర్శం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే నిర్వహించడం జరిగిందని.. జనాభాలో 56.32 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందిన వారని తేలిందని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని అసెంబ్లీలో ఆమోద ముద్ర వేశామని తెలిపారు.