ఏపీ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు.. పలు కీలక కేటాయింపులు

-

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ 47వ అధికారి సమావేశం, అలాగే మంత్రుల బృంద సమావేశం కూడా నిర్వహించబడిందని తెలిపారు. 2014-19 కాలంలో గెజిటెడ్ అధికారుల క్వార్టర్లకు సంబంధించిన రూ. 514 కోట్ల విలువైన టెండర్లను సీఆర్డీఏ ఆమోదించిందని వెల్లడించారు. నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా ఆమోదం పొందాయని పేర్కొన్నారు.

సీడ్ యాక్సిస్ రోడ్ లో అదనపు రహదారుల టెండర్లు కూడా సీఆర్డీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాయి. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం 9 టవర్లకు రూ. 506.67 కోట్లు, మరో 12 టవర్లకు రూ. 517 కోట్లు కేటాయించగా, మొత్తం రూ. 1,732.31 కోట్ల విలువైన టెండర్లకు అనుమతి లభించిందని నారాయణ తెలిపారు.

అలాగే, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ లా యూనివర్సిటీకి 55 ఎకరాల భూమి కేటాయించినట్లు చెప్పారు. క్వాంటం వ్యాలీకి 50 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ కళాశాల కోసం ఇప్పటికే కేటాయించిన 15 ఎకరాలతో పాటు, అదనంగా మరో 6 ఎకరాల భూమి కేటాయించారని వెల్లడించారు.

ఇంకా, కోస్టల్ బ్యాంక్‌కి 0.4 ఎకరాలు, ఐఆర్సీటీసీకి 1 ఎకరం, ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగానికి 0.78 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. ఈరోజు మొత్తం 7 సంస్థలకు స్థలాల కేటాయింపులు జరిగాయని, ఇప్పటివరకు 71 సంస్థలకు 1050 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్టు మంత్రి నారాయణ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news