తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి గత ప్రభుత్వ పాలనే కారణమని మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని చెబుతూ, ఆయన ఆవేదన ప్రజా సంక్షేమం కోసం వచ్చినదేనన్నారు. బీజేపీ అధికార పాలనను విమర్శించిన శ్రీధర్ బాబు, “పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత దేశం మొత్తం ప్రశ్నిస్తోంది. బీజేపీ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులతో మీడియా చిట్‌చాట్‌లో పాల్గొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం పనితీరు విఫలమైందని విమర్శించారు. “మోడీ విదేశాలకు వెళ్తే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అసత్యం” అన్నారు. “హెలికాప్టర్ ఎక్కడిది..? గత ప్రభుత్వం తీసిందే. వాళ్లు తిరగకుండా అద్దె కట్టారు, మేం ఉపయోగిస్తున్నాం” అంటూ వివరణ ఇచ్చారు.
ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాళా తీయటానికి గత ప్రభుత్వ విధానాలు బాధ్యతవాహకమని స్పష్టం చేశారు. “కార్పొరేషన్ పేరుతో తీసిన అప్పులు కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఉద్యోగుల పదవి కాలం పెంచిన ఘనత గత ప్రభుత్వానికి చెందుతుంది. కానీ మేము యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే దృష్టితో ముందుకు సాగుతున్నాం” అని వివరించారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై స్పందించిన ఆయన, “మా కుటుంబం మావోయిస్టుల వల్ల నష్టపోయింది. అయినా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మావోయిస్టులతో చర్చలు జరిపిన ప్రభుత్వం మాదే” అని గుర్తు చేశారు.