జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంట పాకిస్తాన్ సైన్యం మరోసారి తెగబడింది. రాత్రి నుండి కొనసాగుతున్న విచక్షణారహిత కాల్పుల్లో 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాక్ సైన్యం పూంచ్ , తంగ్దర్ సెక్టార్లలోని భారతీయ భూభాగంలోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. రాత్రివేళ ఒక్కసారిగా మొదలైన కాల్పుల మోతతో నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పాకిస్తాన్ సైన్యం ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా ఇళ్లపై, గ్రామాల్లోకి మోర్టార్ గుండ్లను పేల్చడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
క్షతగాత్రుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉండటంతో పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. భారతీయ భద్రతా దళాలు తక్షణమే స్పందించి ఎదురు కాల్పులు జరుపుతున్నప్పటికీ, పాకిస్తాన్ వైపు నుండి కాల్పులు ఆగడం లేదు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, నిరంతరాయంగా కురుస్తున్న మోర్టార్ షెల్స్ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.