వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలోని రైతులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్రంగా స్పందించారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. “మేము నెలకు 300 కోట్లతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తే, ఇవాళ దాన్ని పూర్తిగా ఆపేశారు. పేదలు వైద్యం కోసం అప్పులు చేసుకుంటున్నారు,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “రైతులకు ఉచిత విద్యుత్ కోసం మేము సెకీతో యూనిట్‌కు రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం రూ.4.60కి ఒప్పందం చేసుకుంది. ఒక్క టమోటా కిలోకి రూ.2 కూడా రావడం లేదు. రైతు దళారుల చెంత బలైపోతున్నాడు. ఉచిత పంటల బీమా లేదు, ఆర్బీకేలు పనికిరావని మారాయి” అని వైఎస్ జగన్ విమర్శించారు.
అంతేకాకుండా.. “లులూ కంపెనీకి రూ.1500 కోట్ల భూమి ఇచ్చారు. ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూ.3000 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. మద్యం తక్కువ ధరకు అందించాల్సింది పోయి అధిక ధరలకు అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు ఊరూరా నిండిపోయాయి. ఉచిత ఇసుక పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు” అని జగన్ మండిపడ్డారు. “బాండ్ల పేరుతో అవినీతికి తెరలేపారు. ఏపీ ఎండీసీ బాండ్లు పేరుతో గనుల్ని అమ్ముకునే వ్యవస్థ రమ్మన్నారని, ఇది చరిత్రలో కనిపించని విధంగా జరుగుతోందని” జగన్ ఆరోపించారు. “ఇన్ని అవినీతులు చేసి, గత ప్రభుత్వాన్ని తప్పుడు ఆరోపణలతో తప్పుపడుస్తున్నారు,” అని అన్నారు.