శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి రోజు కొంత సమయాన్ని వ్యాయామాలకు కేటాయించాలి. చాలా శాతం మంది సమయం లేకపోవడం వలన మరియు జీవన విధానంలో మార్పులు రావడం వలన ఎక్కువ సమయాన్ని వ్యాయామాలకు కేటాయించడం లేదు. అయితే జిమ్ కి వెళ్ళలేని వారు మరియు శారీరక వ్యాయామాలు ఇష్టం లేనివారు ప్రతిరోజు కొంత సమయాన్ని నడవడానికి కూడా కేటాయించవచ్చు. దీని వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతిరోజు వాకింగ్ చేయడం వలన శారీరకంగా ఆరోగ్యానికి సహాయపడటంతో పాటుగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. పైగా, ఫిట్నెస్ పొందాలని అనుకుంటే, కచ్చితంగా వాకింగ్‌ను ప్రారంభించాలి.
ఒక నిమిషం పాటు వాకింగ్ చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ప్రతి రోజూ 5 నుండి 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే, మనసు ఎంతో హాయిగా ఉంటుంది మరియు ఒత్తిడికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. రోజుకు 15 నిమిషాలు పాటు వాకింగ్‌కు కేటాయించడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. కనుక, మధుమేహం సమస్యతో బాధపడేవారు కచ్చితంగా రోజుకు 15 నిమిషాలు పాటు వాకింగ్ చేయాలి. అయితే వాకింగ్ ద్వారా బరువు తగ్గాలని కోరుకునేవారు ప్రతి రోజు 30 నిమిషాలు పాటు వాకింగ్‌కు కేటాయించాలి, ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు కరుగుతుంది.
రోజుకు 45 నిమిషాలు పాటు వాకింగ్ చేయడం వలన, బరువు తగ్గడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపరచుకోవచ్చు. ఎవరైతే రోజుకు 60 నిమిషాలు పాటుగా వాకింగ్ చేస్తారో, వారి శరీరంలో డోపమైన్ విడుదల అవుతుంది. దీంతో శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలని అనుకుంటున్న వారు భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు బరువు కూడా తగ్గించుకోవచ్చు. కనుక వాకింగ్‌ను రోజువారీ జీవితంలో అలవాటుగా మార్చుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు మరియు ఆరోగ్యంగా జీవించవచ్చు.