ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా అన్ని రకాల పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎప్పుడైతే పోషక విలువల లోపం ఏర్పడుతుందో, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా, విటమిన్ బి12 లోపం ఏర్పడితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శరీరంలో రక్తకణాల ఉత్పత్తి మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యం బాగుండడానికి విటమిన్ బి12 ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే దీనికి సంబంధించిన లోపం ఏర్పడుతుందో అరికాళ్ళు మండటం, అలసట, నాడి సమస్యలు మరియు మానసిక సమస్యలు ఎదురవుతాయి.
ముఖ్యంగా దీని వలన రక్తహీనత ఒక సాధారణమైన సమస్యగా మారుతుంది. కనుక ఈ లోపం ఏర్పడితే సరైన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విటమిన్ బి12 లోపం ప్రారంభ దశలో ఇటువంటి కొన్ని లక్షణాలు ఎదురవుతాయి. చిన్న పనులను పూర్తి చేసిన వెంటనే అలసిపోవడం, శరీరంలో శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది దీంతో రోజంతా అలసటగా ఉంటుంది మరియు రోజువారి పనులను పూర్తి చేయడానికి ఎంతో కష్టపడతారు. తలతిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఈ పరిస్థితి కొనసాగితే రక్తహీనత తీవ్రంగా ఉంటుంది. పైగా నరాల వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల నరాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేతుల్లో తిమ్మిరి మరియు మంటలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మానసిక ఆరోగ్యం పై కూడా ఈ లోపం ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఆందోళన, ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వంటి మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఈ లోపాన్ని నివారించుకోవాలంటే రోజువారి ఆహారంలో భాగంగా గుడ్లు, పాలు, మాంసం, చేపలు, కోడి వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. శాకాహారులు అయితే సప్లిమెంట్లను తీసుకోవడం ఎంతో అవసరం.