వేసవికాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వలన అందరూ అసౌకర్యంగా భావించి ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తల్లిదండ్రులకు మరియు పిల్లలకు ఎంతో కష్టం అవుతుంది. ఎండలు ఎక్కువగా ఉండడం వలన పిల్లలు ఏసీ గదిలో మాత్రమే పడుకుంటారు. పైగా వారు ఎంతో సున్నితంగా ఉండటం వలన తల్లిదండ్రులు కూడా ఏసీ గదిలోనే పడుకో పెడుతూ ఉంటారు. కాకపోతే పిల్లలను ఏసీ గదిలో పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏసీ గాలి నేరుగా పిల్లల పై పడితే, వారి శరీర ఉష్ణోగ్రత అసమతుల్యంగా మారిపోతుంది.
దీని వలన వారి రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. కనుక ఏసీ నుండి వచ్చే గాలి దిశను సరైన విధంగా మార్చుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు చలిని తట్టుకోలేరు. దీని వలన జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కనుక ఏసీ గదిలో ఉష్ణోగ్రతను కేవలం 24°C నుండి 26°C మధ్య ఉంచడం మేలు. ఈ విధంగా ఉష్ణోగ్రతను నియంత్రించడంతో పాటుగా, పిల్లలకు వేసే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలకు ఎప్పుడూ కాటన్ దుస్తులు వేయడం మంచిది. ముఖ్యంగా వేసవికాలంలో అసౌకర్యంగా భావిస్తారు, కనుక కచ్చితంగా కాటన్ దుస్తులను వేయాలి.
ఎప్పుడైతే ఏసీ ను ఎక్కువగా ఉపయోగిస్తారో, గదిలో మరియు శరీరంలో తేమ తగ్గిపోతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కనుక తరచుగా పిల్లలకు మంచినీళ్లు, తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు వంటివి ఇవ్వాలి. ఇలా చేయడం వలన డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవచ్చు. వేసవికాలంలో ఏసీని ఎక్కువగా ఉపయోగించడం సహజమే. దీని వలన ఏసీ ఫిల్టర్లు ధూళితో నిండిపోతాయి. కనుక డస్ట్ ఎలర్జీ, దగ్గు వంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే వాటిని వారానికి ఒకసారి కచ్చితంగా శుభ్రం చేయడం మేలు.