దేశంలో ఎక్కడ చూసినా ఆపరేషన్ సింధు గురించి ఎన్నో చర్చలు జరుగుతూ కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు సహకరించిన టర్కీ దేశం పై భారత్ కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. టర్కీ కి సంబంధించిన సెలబి ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను భారతదేశం రద్దు చేసింది. ఈ సంస్థ భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే, పాకిస్తాన్‌కు సహాయం చేయడంతో భారతదేశం ఈ సంస్థను రద్దు చేసింది. భారతదేశ భద్రతను పరిరక్షించేందుకు ఈ చర్యను తీసుకున్నామని పౌర విమానయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సంస్థ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి తొమ్మిది ప్రదేశాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అలాగే, సెలబి సంస్థ విదేశీ విమానయాన సంస్థలకు కూడా సేవలు అందిస్తుంది. భారతదేశంలో ఈ సంస్థ సెక్యూరిటీ సేవలు మరియు గ్రౌండ్ హ్యాండ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూ, ఢిల్లీలో కార్గో సేవలను కూడా అందిస్తోంది. ఈ విధంగా ఎన్నో కీలక భద్రతా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరగడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
గతంలో భారతదేశం టర్కీ దేశానికి సహాయం చేసింది. అయినప్పటికీ టర్కీ దీనిని మర్చిపోయి పాకిస్తాన్‌కు సహాయం చేసింది. ఆపరేషన్ సింధు తర్వాత, టర్కీ పాకిస్తాన్‌కు డ్రోన్ లు, క్షిపణులు వంటిని ఇచ్చి సాంకేతిక సహాయాన్ని అందించింది. దీనివల్ల ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ సహాయం కారణంగా బాయికాట్ టర్కీ అనే విమర్శలు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ అయ్యింది. పైగా టర్కీ వెళ్లాలని భావించిన టూరిస్టులు టికెట్లు రద్దు చేసుకోగా, ట్రావెల్ ఏజెన్సీలు అనేక బుకింగ్స్ ను కూడా నిలిపివేశాయి. ఈ విధంగా టర్కీ దేశం పై భారతదేశం కఠిన చర్యలను తీసుకుంది.