వేసవి కాలం లో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, ఏసీలను ఎక్కువగా ఉపయోగించడం సహజమే. అయితే తరచుగా ఏసీ వాడటం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్ లు చెబుతున్నారు. ఈ సంవత్సరం మధ్య మధ్యలో వర్షాలు పడటం వలన కొంత ఉపశమనం లభించింది అనే చెప్పవచ్చు. దీని వల్ల సూర్యుడి ప్రతాపం కొంత తగ్గింది. అయితే ఇటువంటి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
వేసవి కాలంలో కచ్చితంగా టోపీని ఉపయోగించాలి. ఎప్పుడైతే సూర్యకిరణాలు నేరుగా తలపై పడతాయో, అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండలో బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లి, సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలి. చాలా శాతం మంది ఎండలో బయటకు వెళ్ళినప్పుడు సన్ స్ట్రోక్ తో బాధపడతారు. సన్ స్ట్రోక్ నుండి రక్షించుకోవాలంటే, ఓఆర్ఎస్ వంటి వాటిని నీళ్లలో కలిపి ప్రతిరోజు తాగాలి. వేసవి కాలంలో ఏసీని ఎక్కువగా ఉపయోగించి, తిరిగి బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఏసీ గదుల్లోకి వెళ్లడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం నీడలో ఉండాలి, ఆ తర్వాతే ఏసీ గదుల్లోకి వెళ్లాలి. అదేవిధంగా, రోజంతా ఏసీలో ఉండి ఒక్కసారిగా అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు. శరీరం ఉష్ణోగ్రత మార్పులకు అలవాటు అయ్యే విధంగా కొంత సమయం తర్వాత బయటకు వెళ్లడం మంచిది. దీంతో పాటుగా మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తప్పకుండా తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలను పాటించడం వలన వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.