తెలంగాణలో ఇన్నాళ్లుగా అదుపులో ఉన్న కరోనా ఒక్కసారిగా అలజడి రేపింది. మంగళవారం వరకు కేవలం 5 కేసులు మాత్రమే నమోదు కాగా.. బుధవారం ఒక్కరోజే 8 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. కొత్త నమోదైన 8 కేసుల్లో ఏడుగురు ఇండోనేషియా పౌరులు కాగా.. మరొకరు స్కాట్లాండ్‌లో విద్యాభ్యాసం కోసం వెళ్లి తిరిగొచ్చిన మేడ్చల్ యువకుడు ఉన్నాడు.
ఇటీవల ఇండోనేషియాకు చెందిన 10 మంది పౌరులు కరీంనగర్‌కు వచ్చారు. వారిలో ఒకరికి కరోనా మంగళవారం నిర్ధారణ అయ్యింది. దీంతో మిగిలిన 9 మందిని కూడా అత్యవసరంగా చెస్ట్ ఆస్పత్రికి తరలించి నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ కేంద్రంలో ఉంచారు. ఇదిలావుంటే కరీంనగర్‌లో వారు ఎంతమందిని కలిశారు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు అనే విషయాలపై అధికారులు ఆరాతీస్తున్నారు.
ఇక మేడ్చల్‌కు చెందిన యువకుడు గత నవంబర్‌లో బీబీఏ చదవడం కోసం స్కాట్లాండ్ వెళ్లాడు. అయితే కరోనా విజృంభన కారణంగా స్కాట్లాండ్‌లో విద్యాసంస్థలను మూసేయడంతో మార్చి 16న స్వదేశానికి తిరిగొచ్చాడు. 17న దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యాధికారులు అతని కుటుంబసభ్యులను కూడా ఐసోలేషన్ కేంద్రంలో పెట్టారు.